తమిళనాడు(Tamil Nadu)లో నిర్వహించే జల్లికట్టు పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. జల్లికట్టుపై తమిళనాడు చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. తమిళ సంస్కృతి(culture)లో జల్లికట్టు ఓ భాగమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తమిళనాడులో సంక్రాంతి (Sankranti) పండుగ సమయంలో ఈ జల్లికట్టు ఆటను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈ క్రీడపై గతంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టు (jallikattu)పై నిషేధం విధించింది. ఈ క్రీడ జంతువులపై హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని అప్పట్లో కోర్టు పేర్కొంది. అయితే, ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఈ క్రమంలోనే జల్లికట్టును ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టం నుంచి తొలగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2017లో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుకూలంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త యాక్ట్ (New Act) తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 1960 నాటి జంతు హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఈ చట్టం ఉందని పిటిషనర్లు తెలిపారు. దీని వల్ల జంతువులు, మనుషులు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని, హింసతో కూడిన ఈ ఆటను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గతేడాది విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రానా దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని తెలిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం(court of law) దీనిపై తీర్పు వెలువరించింది. జల్లికట్టుపై తమిళనాడు చేసిన చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.