2008 లో జరిగిన ముంబై దాడుల కేసులో ప్రమేయం ఉన్న నిందితున్ని భారత్ కు అప్పగించడానికి అమెరికా ఒప్పుకుంది. ఇదివరకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమ్మతించడంతో ఇప్పుడు లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు కూడా అనుమతించింది. నిందితుడు పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా వ్యాపారమేత్త తహవుర్ హుస్సేన్ రాణాను భారత్ కు అప్పగిచనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. గతంలోనే సదరు నిందితుడిని అప్పగించాలని భారత్ కోరాగా అమెరికా వైట్ హౌజ్ ఆమోదం తెలిపింది. తాజాగా రాణాను అప్పగించేందుకు అనుమతులు వెలువడ్డాయి. ముంబై పేలుళ్లలో హుస్సేన్ పాత్ర ఉందని భారత్ చేసిన అభ్యర్థన మేరకు అమెరికా అతన్ని అరెస్ట్ చేసింది.
హుస్సేన్ చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ మన్ హెడ్లీకి లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని హుస్సేన్ కు తెలుసని అమెరికా న్యాయవాదులు కోర్టులో వాదించారు. హెడ్లీ పాకిస్థాన్ అమెరికా సంతతికి చెందినవాడని తెలిపారు. హెడ్లీకి సహాయం చేస్తే లష్కరే కు చేసినట్లేనని రాణా భావించినట్లు తెలిపారు. హుస్సేన్ కు ముంబై దాడులకు సంబంధించిన ప్రణాళిక ముందే తెలుసునని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి హుస్సేన్ ను భారత్ కు అప్పగించేందుకు ఒప్పుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికా పర్యటించనున్నారు. ఈ పర్యటనకు నెల ముందే ఉత్తర్వులు రావడం ఇరు దేశాల మద్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు అమెరికా పేర్కొంది. భారత్ తో కలిసి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తాము గౌరవిస్తామని తెలిపారు.
నేరస్థుల అప్పగింతపై చేసుకున్న అవగాహన ఒప్పందం కింద భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు గతంలో తహవూర్ హుస్సేన్ ను అమెరికా పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు. కరోనా ప్యాండమిక్ సమయంలో జైల్లో ఉన్న హుస్సేన్ కు కరోనా సోకడంతో విడుదల చేశారు. అయితే భారత ప్రభుత్వం మరోసారి అభ్యర్థన చేయడంలో 2020 జూన్ 10న మరోసారి అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. త్వరలో భారత్ కు హుస్సేన్ ను అప్పగించనున్నారు అమెరికా పోలీసులు.