Manish Sisodia : జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా.. భార్యను చూసేందుకు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) జైలు నుంచి బయటకు వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor scam) కేసుల్లో అరెస్టెయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధురా రోడ్డులోని నివాసానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలు (Tihar Jail)లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా కోర్టు అనుమతితో ఉదయం 10 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన తన భార్యతోనే ఉండనున్నారు.
లిక్కర్ కుంభకోణంలో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ (CBI) అధికారులు సిసోదియా (Manish Sisodia)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి ఆయన తిహాడ్ జైల్లో ఉంటున్నారు. కాగా.. సిసోదియా జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య సీమా(Wife Seema) ఆరోగ్యం క్షీణించింది. గతంలోనూ దిల్లీ హైకోర్టు.. తన భార్యను చూసేందుకు అనుమతించినా.. ఆమెను సిసోదియా కలవలేకపోయారు. తాజాగా మరోసారి ఆయన తన సతీమణిని కలిసేందుకు సిటీ కోర్టు అనుమతించింది.