Revanth Reddy: తెలంగాణ(Telangna) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మహరాష్ట్ర(Maharastra)లో ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావు సాఠే(Annabhau Sathe) 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్(BRS) పార్టీ దేశరాజకీయాలపై దృష్టి పెట్టి.. తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారన్నారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్ముతో దేశంలో రాజకీయాలు చేస్తున్నారని అని మండిపడ్డారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందించారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని, ఇలాంటి సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి కండువా కప్పడం ఏంటని ప్రశ్నించారు. మానవత్వం ఉన్నవారు ఇలాంటి రాజకీయాలు చేస్తారా అని ఫైర్ అయ్యారు. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, వరదల వల్ల రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. చనిపోయిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంటలు నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వమే నివేదికలు ఇస్తూ.. కేవలం రూ. 500 కోట్లు కేటాయించడం ఏంటని మండిపడ్డారు. వరదలతో రైతులు నష్ట పోతే కేసీఆర్ రాజకీయాలు చేయాల్సిన సందర్భం ఇదేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ విషయంలో కేంద్రం తెలంగాణను ఆదుకోకపోతే పార్లమెంటును స్తంభింపజేస్తామని, ఎలాగైన వరద సాయం సాధిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.