Atal Sethu: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముంబయి లో నిర్మించిన పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) శుక్రవారం ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ దీనిని నిర్మించారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. దక్షిణ ముంబైని, నవీ ముంబై(Mumbai )ని కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడవుతో దాదాపు రూ. 18వేల కోట్ల ఖర్చుతో 2018లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం ఆరు లేన్లతో సముద్రంపై 16.5 కిలోమీటర్లు, నేలపై 5.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. దీని ద్వారా 2 గంటలు చేసే ప్రయాణం 20 నిమిషాల్లో పూర్తికానుంది. భూకంపాలు తట్టుకునేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు.
దీనికి ముందు మోడీ నాసిక్‌లో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు రెండు కిలోమీటర్లకుపైగా ఈ రోడ్ షో సాగింది. శ్రీ కాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం నేషనల్ యూత్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.