ఆఫ్రికన్ యూనియన్(African Union)కు జీ20 దేశాల కూటమిలో శ్వాశత సభ్యత్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి.ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. జీ20 సమావేశాలు (G20 meetings) శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ మాట్లాడుతూ, అందరితో కలిసి (Sabka Sath) అనే భావానికి అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత దేశం ప్రతిపాదిస్తోందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ‘‘మీ అంగీకారంతో…’’ అని చెప్తూ, జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశించినట్లు తెలియజేస్తూ, ఆయన ఓ చిన్న సుత్తితో మూడుసార్లు కొట్టారు. ‘‘మనం పని ప్రారంభించే ముందు, శాశ్వత సభ్యునిగా తన స్థానాన్ని స్వీకరించవలసినదిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానిస్తున్నాను’’ అని చెప్పారు.
50 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత మెంబర్ గా చేర్చే ప్రతిపాదనను ప్రధాని మోదీ (Pmmodi) సదస్సులో ప్రకటించగా, దీనికి అన్ని సభ్య దేశాలూ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అజలి అసౌమని(Ajali Asoumani)ని ..మోదీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘జీ20 కుటుంబంలోకి శాశ్వత సభ్యురాలిగా ఆఫ్రికన్ యూనియన్ ను ఆహ్వానిస్తున్నాను.ఇది జీ20ని బలోపేతం చేస్తుంది. అలాగే, అంతర్జాతీయంగా దక్షిణాది స్వరం బలపడుతుంది’’అని ట్వీట్ చేశారు. సదస్సు ప్రారంభానికి ముందు మొరాకో(Morocco)లో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు.