Puducherry: పుదుచ్చేరి మహిళా మంత్రి చంద్ర ప్రియాంక ఆమె పదవికి రాజీనామా చేశారు. 40 ఏళ్ల తర్వాత కేంద్రపాలిత ప్రాంతానికి మంత్రి అయిన తొలి మహిళగా ప్రియాంక రికార్డులెక్కారు. ఆమె తండ్రి చంద్రకాసు నెడుంగడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఆరుసార్లు గెలిచారు. తండ్రి మరణం తర్వాత ప్రియాంక అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2021లో ప్రియాంక రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ప్రస్తుతం ఈమె ఈ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రమంతా రాజకీయాలు పూర్తిగా కుట్రలతో నిండిపోయాయని, అంతా డబ్బుమయమే అని ఆమె ఆరోపించారు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ ఎక్కువగా లింగ వివక్ష, రాజకీయాల్లో కులతత్వం బాగా పెరిగాయని ఆమె రాజీనామాలో పేర్కొన్నారు. అట్టడుగు నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలకు రాజకీయాల్లో అనేక సవాళ్లు తప్పవన్నారు. ప్రజల్లో తనపై ఉన్న ఆదరణను చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఆమె రాజీనామా లేఖలో తెలిపారు. కుట్ర రాజకీయాలను అధిగమించడం అనుకున్నంత సులభం కాదు. ధనబలం అనే పెద్ద రాక్షసితో నేను పోరాడలేనని ఆమె తెలిపారు. కేబినేట్లో అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రంగస్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆమె నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ కోరారు. పదవీకాలంలో ప్రియాంక పుదుచ్చేరిలో ప్రజా రవాణా సమార్థ్యాన్ని పెంచే దిశగా ప్రయత్నించారు. ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేశారు.