Odisha : భారతదేశంలోని ముస్లింలు జూన్ 17, సోమవారం బక్రీద్ జరుపుకున్నారు. అదే రోజు ఒడిశాలోని బాలాసోర్ నగరంలో పశువుల వధపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో బాలాసోర్‌లో కర్ఫ్యూ విధించారు. బుధవారం కూడా బాలాసోర్ నగరంలో కర్ఫ్యూ అమలులో ఉందని అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. ముస్లింల పండుగ బక్రీద్‌ను పురస్కరించుకుని సోమవారం రెండు వర్గాల మధ్య మతపరమైన హింస చెలరేగింది, కొందరు వ్యక్తులు కాలువలో రక్తపు మరకలను చూశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి విషమించి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో 10 మంది గాయపడ్డారు. జనాన్ని అదుపు చేసే క్రమంలో కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
బాలాసోర్‌లో కర్ఫ్యూ కొనసాగుతుంది
జూన్ 19 బుధవారం రాత్రి నగరంలోని పరిస్థితిని సమీక్షించి బాలాసోర్‌లో కర్ఫ్యూ కొనసాగించాలా వద్దా అని పరిపాలన నిర్ణయిస్తుందని అధికారి తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు మూసివేశారు. కర్ఫ్యూ సమయంలో బాలాసోర్ నగరంలోకి అన్ని ప్రవేశ మార్గాలు మూసివేయబడ్డాయి.
ఇంటర్నెట్ సేవలు బంద్
ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు, రెండు వర్గాల మధ్య ఏదైనా ఘర్షణ జరగకుండా చూసేందుకు, పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20 ఉదయం 10 గంటలకు నగరంలో కర్ఫ్యూ విధించిందని హోం శాఖ అధికారి తెలిపారు. కర్ఫ్యూ కారణంగా, హోం శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. దీనిలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని బాలాసోర్ మునిసిపాలిటీ ప్రాంతంలో పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడానికి కేటుగాళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు.
ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి
ఈ ఘటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాలాసోర్ నగరంలో పరిస్థితిని సాధారణీకరించడానికి అన్ని చర్యలను ఉపయోగించాలని ఆయన జిల్లా పరిపాలనను కోరారు. అయితే, నగరంలో కర్ఫ్యూ సమయంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరిపాలన సడలింపు ఇచ్చింది.
35 మంది అరెస్టు
అల్లర్లు, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు 35 మందిని అరెస్టు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ తెలిపారు. కనీసం ఆరు కంపెనీల కేంద్ర బలగాలు బాలాసోర్‌కు చేరుకుంటున్నాయని, వారిని సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తామని కుమార్ చెప్పారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
మంగళవారం సాయంత్రం సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు బాలాసోర్ కలెక్టర్ ఆశిష్ ఠాక్రే తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందని, నగరంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దాదాపు 40 ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించినట్లు బాలాసోర్ ఎస్పీ సాగరిక నాథ్ తెలిపారు.