DeepFake: ‘డీప్‌ఫేక్’పై కొత్త చట్టం..కేంద్ర మంత్రి ప్రకటన
డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అటువంటి టెక్నాలజీ రావడం వల్ల భవిష్యత్తులో ఫేక్ సమాచారం వ్యాపించే అవకాశం ఉందని, దాని వల్ల అమాయకులు బలైపోయే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కేంద్ర సహాయ మంత్రి కీలక ప్రకటన చేశారు. అవసరమైతే డీప్‌ఫేక్ విధానాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ వీడియోలు (DeepFake Videos) సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల న్యూడ్ వీడియోలు వైరల్ (Videos Viral) అయిన తర్వాత అవన్నీ డీప్‌ఫేక్ వీడియోలని గుర్తించారు. హీరోయిన్ రష్మిక డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది ఏఐ టెక్నాలజీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించింది. అటువంటి వీడియోల కట్టడికి చర్యలు చేపట్టింది.
డీప్‌ఫేక్ వీడియోల కట్టడిలో భాగంగా సోషల్ మీడియా (Social Media) సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించనుంది. టెక్నాలజీ, డీప్‌ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే ఫేక్ సమాచారం (Fake Information) నుంచి ప్రజలను రక్షించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajiv Chandrasekhar) వెల్లడించారు. అవసరమైన డీప్‌ఫేక్ విధానాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
ఏఐ (AI) దుర్వినియోగం వల్ల తీవ్ర నష్టాలు కలిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. టెక్నాలజీతో ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్రోహ శక్తులు చేసే ఆ పని వల్ల అమాయకులు బలైపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ వల్ల అనేక ప్రమాదాలు సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారేలోపు కఠిన చట్టాలు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రం ఐటీ నిబంధనలను (IT Rules) తీసుకొచ్చిందని, డీప్‌ఫేక్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సరికొత్తగా ఫ్రేమ్‌వర్క్ (Frame Work)ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.