కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ముంబై నగరానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగరంలోని పలుచోట్ల బాంబు దాడులు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి బెదిరించాడు.
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో బాంబు బెదిరింపు కాల్స్ ప్రజలను వణికిస్తోంది. న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ నగరంలో పలు చోట్ల బాంబులు పేలుతాయని ఓ గుర్తు తెలియని వ్యక్తి నిన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ముంబై అంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానాస్సద వస్తువులు దొరకలేదు. ప్రస్తుతం పోలీసులు ముంబై నగరాన్ని హై అలర్ట్‌లో ఉంచారు. ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. న్యూఇయర్ వేడుకల వేళ ముంబై మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఐదు రోజుల క్రితం కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని ఆర్బీఐ ఆఫీసులు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 11 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ చేశారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదు.