ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల కేంద్రాన్ని భారత్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్ లోని సూరత్ నగరం వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాంతం నుంచే అనేక దేశాలకు వజ్రాలను ఎగుమతి చేస్తూ ఉంటారు. నిత్యం వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూరత్ లో 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. ఈ భారీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు.
ఈ మహా భవన సముదాయంలో 4,500 కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో అందులోనే కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ భవన నిర్మాణానికి నాలుగేళ్ల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ లో ఉన్న డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉండగా ఇప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ సెంటర్ ఇజ్రాయెల్ వజ్రాల కేంద్రాన్ని అధిగమించింది. దాదాపు 65 వేల మంది వజ్రాల నిపుణులు ఈ భవనం నుంచి కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంది.