గుజరాత్ (Gujarat) లోని దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులోకి చొరబడి దోపిడీ (Bank Robbery)కి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే ఓ బ్యాంకులోకి దర్జాగా ప్రవేశించి.. అక్కడ సిబ్బందిని తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. కేవలం ఐదే నిమిషాల్లో రూ.14లక్షల డబ్బుతో ఉడాయించారు. సూరత్ (Surat)లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra ) బ్రాంచ్లో ఈ ఘటన జరిగింది.ఉదయం 11 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో బ్యాంకు వద్దకు వచ్చారు. కస్టమర్లలాగా బ్రాంచ్ ముందు తమ వాహనాలను ఆపి హెల్మెట్స్తోనే దర్జాగా లోపలికి ప్రవేశించారు. వెళ్లీ వెళ్లగానే తమ వద్ద ఉన్న గన్ను, ఇతర ఆయుధాలతో బ్యాంకు ఉద్యోగుల్ని, అక్కడికొచ్చిన కస్టమర్లను బెదిరించి ఓ గదిలో బంధిస్తారు.
అనంతరం కౌంటర్లో ఉన్న సుమారు రూ.14 లక్షల నగదును తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకొని పారిపోయారు. కేవలం 5 నిమిషాల్లోనే తమ పనిపూర్తి చేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఊహించని ఈ ఘటనతో ఉద్యోగులు(employees), కస్టమర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)ని పరిశీలించారు. ఈ మేరకు నగరంలో అలర్ట్ ప్రకటించారు. పలు రోడ్లను బ్లాక్ చేశారు. నగర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేపట్టారు. నగరంలో ఉన్న అన్ని సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి దొంగల కోసం గాలింపు చేపడుతున్నారు.