Fire in Ghazipur Landfill : దేశ రాజధాని దిల్లీలోని ఓ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ చెత్తను డంప్ చేసే ఘజియాపూర్ డంపింగ్ యార్డులో(GHAZIPUR DUMPING YARD ) ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అక్కడ చెత్త భారీగా పేరుకుని ఉండటంతో విషవాయువులు విడుదలై మంటలు మరింతగా ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నల్లని పొగ కమ్మేసింది. అందువల్ల స్థానికంగా నివసిస్తున్న వారు ఇబ్బందులకు గురయ్యారు.
తొలుత అగ్ని ప్రమాదంపై(FIRE ACCIDENT) సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి చేదాటిపోయి భారీగా అగ్ని కీలలు ఎగసిపడటం మొదలైంది. దీంతో మరో 8 ఫైర్ ఇంజన్లు రంగ ప్రవేశం చేశాయి. దీంతో మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ చోటు చేసుకోలేదని దిల్లీ ఫైర్ సర్వస్ ఎస్ఓ నరేశ్ కుమార్ తెలిపారు.
సోమవారం ఉదయం కూడా డంపింగ్ యార్డులో మంటలు చల్లారలేదు. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుని ఉంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. శ్వాస తీసుకోవడానికీ ఇబ్బందిగా ఉందన్నారు. పొగ కారణంగా దగ్గు, కళ్లు మంట లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. డంపింగ్ యార్డు కావడంతో దుర్వాసన దారుణంగా వస్తున్నట్లు తెలిపారు. అయితే కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డును క్లియర్ చేయించక పోవడం వల్లే ఈ ప్రమాదం తలెత్తిందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. చెత్తను క్లియర్ చేయించడానికి 25 వాహనాలు పని చేయాల్సి ఉండగా అందులో సగానికిపైగా పని చేయడం లేదని దుయ్యబట్టాయి.