Loksabha Elections: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ సోషల్ మీడియా వేదికగా విషయాన్ని తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతో.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. అయితే ప్రస్తుతం ఉండే లోక్‌సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాలి.
ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.