Modi Ka Pariwar: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబం లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎదురు తిరిగింది. ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఆ పార్టీ నేతలంగా ఒక్కటై.. ఆ విషయం పై స్పందించారు. బీజేపీ సీనియర్ నేతలు, మంత్రులందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేర్లకు ముందు ‘మోదీ కా పరివార్’ అని చేర్చుకున్నారు. ఆదిలాబాద్లో సోమవారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్పై ఎదురుదాడికి దిగారు. మోడీ ఇక్కడ మాట్లాడుతూ, ‘నా కుటుంబం కారణంగా నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇప్పుడు దేశం మొత్తం మోడీ కుటుంబమని చెప్పుకుంటుందన్నారు. దేశం ఇప్పుడు ఒకే స్వరంతో .. మై హూ పరివార్ అని అంటోందన్నారు. నేనే మోడీ కుటుంబం అని అంటోందని ఆయన పేర్కొన్నారు. మై హూ మోడీ పరివార్ అని సభకు వచ్చిన ప్రజలతో మోడీ పలికించారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, సుధాన్షు త్రివేది సహా పలువురు పెద్ద నేతలు ట్విట్టర్లో తమ బయోను మార్చుకున్నారు. నేతలంతా తమ ప్రొఫైల్ ఓ మోడీ కా పరివార్ అని రాసుకున్నారు. అదే సమయంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పాట్నాలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ను బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసింగ్ కల్లు నమోదు చేశారు.
ఆదిలాబాద్ సభలో ప్రధాని ఇంకా మాట్లాడుతూ, ‘140 కోట్ల మంది దేశప్రజలు నా కుటుంబం. ఈ యువకులు నా కుటుంబం. దేశంలోని కోట్లాది మంది కుమార్తెలు, తల్లులు, సోదరీమణులు నా కుటుంబం. దేశంలోని ప్రతి పేదవాడూ నా కుటుంబం. ఎవరూ లేని వారు కూడా మోడీకి చెందిన వారు, మోడీ వారికే చెందుతారు. నా భారతదేశం నా కుటుంబం. నేను మీ కోసం జీవిస్తున్నాను, మీ కోసం పోరాడుతున్నాను, మీ కోసం పోరాడుతూనే ఉంటాను. ’ అన్నారు.