త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ కంటే జేడీఎస్‌కు ఎంతో కీలకం. మొదటి రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కాబట్టి ఆ పార్టీలు ఓడినా, గెలిచినా ప్రభావం తక్కువే! జేడీఎస్‌కు చావో రేవో తేల్చుకోవాల్సినవే. 1999లో పుట్టిన ఈ ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన మెజార్టీని దక్కించుకోలేదు. పార్టీ అధినేతలు దేవేగౌడ, కుమారస్వామి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చున్నప్పటికీ, తమ కంటే ఎక్కువ స్థానాలు వచ్చిన వంటి జాతీయ పార్టీలతో కలిసినప్పుడే. 224 అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 199 చోట్ల పోటీ చేసి, 37 సీట్లు గెలిచి, 18.36 శాతం ఓటు బ్యాంకును మాత్రమే దక్కించుకుంది.
1999 నుండి చూసినా ఆ పార్టీ పట్టుమని అరవై స్థానాలు గెలిచిన సందర్భం లేదు. 1999లో 203 స్థానాల్లో పోటీ చేసి 10 శాతం ఓటు బ్యాంకుతో 10 సీట్లు గెలిచింది. 2004లో 58 సీట్లు, 20 శాతం ఓటు బ్యాంకు, 2008లో 28 సీట్లు గెలిచి 19 శాతం ఓటు బ్యాంకు, 2013లో 40 సీట్లు దక్కించుకొని 20 శాతం ఓటు బ్యాంకు, 2018లో 37 సీట్లలో మాత్రమే గెలుపొందింది. పోనీ లోకసభలో ప్రభావం చూపిందా అంటే అది కూడా అంతంత మాత్రమే. 28 లోకసభ స్థానాలకు గాను 2004లో 2, 2009లో 3, 2014లో 2, 2019లో 1 సీటు మాత్రమే దక్కించుకుంది.
2023 అసెంబ్లీ ఎన్నికలు ఈ పార్టీకి నిర్ణయాత్మకం. బీజేపీ, కాంగ్రెస్‌తో కర్నాటకలో బలంగా పోరాడుతున్న ఏకైక ప్రాంతీయ పార్టీ. ఇది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, రాష్ట్రంలో ప్రధానంగా ఓ సామాజిక వర్గం, ఓ ప్రాంతం పైనే పట్టు సాధించింది. పాత మైసూరు ప్రాంతంలోని 61 సీట్లలో వీరి సామాజిక వర్గం ఒక్కలింగ కమ్యూనటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ జేడీఎస్‌ను దెబ్బకొట్టి, అత్యధిక స్థానాలు గెలుపొందాలని కమలం, హస్తం పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో మిషన్ 123తో ముందుకు వచ్చింది. అయితే జేడీఎస్‌కు ఇది పగటి కల మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కాంగ్రెస్, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాని సందర్భంలో మాత్రం కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతుంది. జేడీఎస్ 2004లో గెలిచిన 58 సీట్లు మాత్రమే ఇప్పటి వరకు అత్యధికం.
ప్రస్తుతం కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా వొక్కలింగ నాయకుడు డీకే శివకుమార్ ఉన్నారు. ఇది జేడీఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఉపయోగపడుతుంది. బీజేపీ యడ్యూరప్ప కూడా ఇదే కమ్యూనిటీకి చెందిన నాయకుడు. 2018 ఎన్నికల సమయంలో జేడీఎస్‌ను బీజేపీ బీ టీమ్‌గా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్. ఇది ఆ పార్టీకి బాగా మైనస్ అయింది. ఎప్పుడు దాదాపు నాలుగో వంతు సీట్లు గెలవని జేడీఎస్, ఈసారి ఏకంగా తమ ఓట్లపై దృష్టి సారించిన జాతీయ పార్టీలను తట్టుకొని, ఎలా నిలబడగలుగుతుందో చూడాలి.