ప్రపంచం మొత్తం నేడు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తోంది. కారణం ఏంటంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం చేపడుతుండడం. ఇప్పటికే అమెరికా, రష్యాలతో పాటు మన దేశం కూడా చంద్రుడి రహస్యాలను కనుగొనేందుకు చాలా ప్రయోగాలు చేసినా.. ఇప్పుడు చేపట్టిన ఈ ప్రయోగం మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుంది. గతంలో చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాలను చేసిన ఇస్రో ఈ నెల మరో చంద్రయాన్-3ని ప్రయోగించబోతుంది. ఈ ప్రయోగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అంతరిక్షంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించినా చంద్రుడిపై ఉన్న సమాచారాన్ని లోతుగా విశ్లేషించడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేస్తుంది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సీఈవో పవన్ చందన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్‌ను స్కైరూట్ ఏరోస్పేస్ అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే.
చంద్రయాన్-3 విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరుతుందని పవన్ తెలిపారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయని రాబోవు కొన్ని రోజుల్లో ఆ లిస్ట్ లో మన దేశం పేరు నిలుస్తుందని తెలిపారు. దీనితో పాటు చంద్రయాన్-3 విజయవంతమైతే అంతరిక్ష సాంకేతికతలో భారత్ కు పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. భారత అంతరిక్ష సాంకేతిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించవచ్చని పవన్ తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో అభివృద్ధి చేసిన, అంతరిక్ష రంగానికి సంబంధించిన హార్డ్ వేర్, తక్కువ ధరకు కచ్చితమైన ఫలితాలను ఇచ్చే విడి భాగాల వంటి వాటికి ప్రచారం దక్కుతుందని తెలిపారు. ఇతర దేశాలు చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించిన హార్డ్ వేర్, విడి భాగాలకు భారత్ కు ఆర్డర్లు ఇస్తాయని చెప్పారు.
దీంతో వాటిని సరఫరా చేసే దేశంగా భారత్ మారుతుందని తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్ స్పేస్-టెక్ స్టార్టప్ లలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో రాణిస్తోన్న దేశాలు అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు రంగ పెట్టుబడుల జోక్యంతో కొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తాయని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, ఆర్థిక రంగ బలోపేతానికి, ఆవిష్కరణలకు దారి తీస్తాయని ఇంటర్య్వూలో పవన్ తెలిపారు. భారత అంతరిక్ష రంగ ఆదాయం విషయంలో కొన్ని నెలల క్రితం ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ISpA), ఈ అండ్ వై (EY) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. అందులో భారత అంతరిక్ష రంగ ఆదాయం 2025లోపు దాదాపు రూ.1.055 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశాయి. 2020లో ఈ ఆదాయం దాదాపు రూ.79.3 వేల కోట్లుగా ఉంది. ఇక చంద్రయాన్-3 ప్రయోగం విజవంతం అయితే భారతదేశ కీర్తి మరింత పెరగనుంది అనేది స్పష్టం.