కాలేయానికి వచ్చే వ్యాధి హెపటైటిస్(Hepatitis). ఇన్ఫెక్షన్లు, ఆల్కహాల్ వంటి దురలవాట్లతో పాటు కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు, కొన్ని రకాల మందులను తీసుకోవడం వంటి కారణాలతో హెపటైటిస్ సంక్రమించవచ్చు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో ) నడుం కట్టింది. ప్రతి ఏటా జూలై 28న ప్రపంచ హెపటైటిస్ వ్యాధి అవగాహన దినం ( వరల్డ్ హెపటైటిస్ డే(World Hepatitis Day) )నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హెపటైటిస్ ఎలా వస్తుంది? దాని లక్షణాలేంటి? ఈ వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఒక చిన్న వైరస్ శరీరంలో అతి పెద్ద అవయవమైన కాలేయాన్ని(Liver) దెబ్బతీస్తుంది. అదే.. హెపటైటిస్ వైరస్. ఈ వైరస్ లు ముఖ్యంగా నాలుగు రకాలుంటాయి. వీటిలో సాధారణంగా కనిపించేవి హెపటైటిస్ ఎ, హెపటైటిస్ ఇ ఇన్ ఫెక్షన్లు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా కొంచెం ఎక్కువే.
మన భారతీయుల్లో 2.5 శాతం మందిలో హెపటైటిస్ బి, 1 శాతం మందిలో హెపటైటిస్ సి ఇన్ ఫెక్షన్లు ఉన్నాయని అంచనా.హెపటైటిస్ ఎ, ఇ వైరస్ లు కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల వస్తాయి. అందుకే వర్షాకాలం(rainy season)లో ఈ రకమైన ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇవి పదిహేను రోజుల్లో వాటికవే తగ్గిపోతుంటాయి. కానీ హెపటైటిస్ బి, సి వైరస్ లు మాత్రం రక్తం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి.హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 2011 నుంచి పుట్టిన ప్రతివారికీ మూడు డోసుల్లో వ్యాక్సిన్ ని తప్పనిసరి చేశారు. దానికన్నా ముందు పుట్టిన వాళ్లు కూడా ఏ వయసులో అయినా ఈ వ్యాక్సిన్ (Vaccine)ని వేయించుకోవచ్చు. దీని ధర కూడా చాలా తక్కువ. ఇకపోతే, హెపటైటిస్ ఎ, ఇ రాకుండా ఉండాలంటే బయటితిండి తినకుండా ఇంటి ఫుడ్ తీసుకోవడమే మార్గం. పానీపూరీలు, రోడ్డు మీది స్నాక్స్ లాంటివి తినకూడదు. కాచి వడబోసిన నీటినే తాగాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెపటైటిస్ మాత్రమే కాదు, ఇతరత్రా ఇన్ ఫెక్షన్లు (Infections) రాకుండా కూడా నివారొంచవచ్చు.