Smokey Pan : ఇటీవల కాలంలో ఎగ్జిబిషన్లు, కొన్ని రెస్టారెంట్లలో స్మోకీ బిస్కెట్లు, పాన్లను ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో వీటిని తిని అస్వస్థతకు గురైన వారి ఘటనలూ పెరుగుతున్నాయి. తాజాగా పన్నెండేళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేసిన స్మోకీ పాన్‌ను(Smokey Pan) తిని అస్వస్థతకు గురైంది. అంతా అది తిని నోట్లోంచి పొగలు వదులుతుండటం చూసి తాను కూడా అలా చేయాలని అనుకుంది.
బెంగళూరులోని ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో స్మోకీ పాన్‌ను బాలిక కొనుక్కుని తింది. వెంటనే కడుపులో నొప్పిగా అనిపించింది. అది అంతకంతకూ ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. దీంతో ఆమెను పరీక్షించిన డాక్టర్లు కడుపులో రంధ్రం(Hole) అయినట్లు గుర్తించారు. చికిత్స చేయడం ప్రారంభించారు. ఎక్కడబడితే అక్కడ ఈ స్మోకీ పాన్లు, బిస్కెట్లు అందుబాటులో ఉంటున్నాయని వీటిని తినడం విషయంలో అంతా సొంత జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో తమిళనాడులో సైతం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. స్మోకీ బిస్కెట్ తిన్న ఓ బాలుడు వెంటనే మూర్ఛ పోయాడు. దీంతో అతడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆహారంలో లిక్విడ్ నైట్రోజన్(Liquid Nitrogen) వాడకంపై బ్యాన్ విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.