అన్ని బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు… ఎంత దూరమైనా, ఎవరినైనా ఎదురించి పెళ్లి చేసుకుంటారు. కానీ… తాను ఇష్టపడిన అమ్మాయిని అనుకోని ప్రమాదం కబళించి.. నడవలేని స్థతికి వెళ్లినా.. ఆమె చెయ్యి వదలకుండా.. పెళ్లి చేసుకున్నాడు. తాను నిశ్చితార్థం చేసుకున్న యువతి పక్షవాతానికి గురైతే… ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అహ్మదాబాద్ నగరం పటాన్ ప్రాంతానికి చెందిన రీన్లాబాతో మహావీర్ సింగ్ కు మూడేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది.వధువు రీన్లాబా ఆరు నెలల క్రితం స్నేహితురాళ్లతో ఆడుకుంటుండగా చెట్టు మీద నుంచి కింద పడి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వధువు శరీరం కదల్చలేని పరిస్థితుల్లో ఉంది.దీంతో మహావీర్ తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వస్తాయని భయపడిన వధువు తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆందోళన చెందారు. కుటుంబసభ్యులు సమావేశమై పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తన పుట్టినరోజున మహావీర్ రీన్లాబాపై తన ప్రేమను అంగీకరించాడు.
తాను నిశ్చితార్థం చేసుకున్న వధువు రీన్ లాబా ఎలా ఉన్నా ఆమెనే వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు వరుడు చెప్పాడు. తల్లిదండ్రులు వ్యతిరేకించినా వరుడు మాత్రం వెనక్కితగ్గకుండా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వధువును తన చేతులతో ఎత్తుకొని ఏడు అడుగులు వేసి పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం నడవలేని స్థితిలో ఉన్న వధువును వరుడు ఎత్తుకొని ఏడు అడుగులు వేసి వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నాడు. కాగా… ఆ వరుడు పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.