2023 క్యాలెండర్ ఏడాదిలో తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మూడు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం గం.2.30 ప్రకటించనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ రాష్ట్రాల ప్రస్తుత శాసన సభల పదవీకాలం మార్చి నెలలో ముగియనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాలలో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీస్ సిబ్బంది అభిప్రాయాలను సేకరించింది.
ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ తర్వాత కర్నాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసన సభల పదవీకాలాలు ఈ ఏడాదిలో ముగుస్తున్నాయి.
త్రిపురలో ప్రస్తుతం మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. 60 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీయే 33, సీపీఐ(ఎం) 16 సీట్లు గెలిచింది. ఇతరులు ఎనిమిది సీట్లు గెలిచారు. మేఘాలయలో బీజేపీ మిత్రపక్షం NPPకి చెందిన కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ కూడా బీజేపీ కూటమి ఎన్డీయే అధికారంలో ఉంది. NDPPకి చెందిన నిప్యూ రియో ముఖ్యమంత్రిగా ఉన్నారు.