»Droupadi Murmu Today Bhudan Is The President Of Pochampally
Droupadi Murmu: నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పోచంపల్లిలో పర్యటించనున్నారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి.. వివిధ అవార్డు గ్రహీతలు, చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు.
Droupadi Murmu: శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ పోచంపల్లిలో పర్యటించనున్నారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి తర్వాత వివిధ అవార్డు గ్రహీతలు, చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల మధ్య రాష్ట్రపతి పర్యటన కొనసాగనుందని అధికారులు తెలిపారు. బేగంపేట విమానశ్రయం నుంచి పోచంపల్లికి ప్రత్యేక హెలికాప్టర్లో ముర్ము చేరుకుని తర్వాత భారీ కాన్వాయ్‌తో పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాభావే భవనానికి వెళ్తారు.
ఆ తర్వాత శ్రీరంజన్ సిల్క్ సెంటర్‌ను సందర్శిస్తారు. దారం నుంచి వస్త్రం తయారీ ప్రక్రియ ఇందులోనే ఉంటుంది. పట్టుగూళ్ల నుంచి పట్టు తీయడం, ఆసు పోయడం, రంగులు అద్దడం, చిటికి తిప్పడం, చీరలు నేయడం వంటివి అడిగి తెలుసుకుంటారు. తర్వాత బాలాజీ ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారు. ఈ ఫంక్షన్ హాల్లో కేవలం 400 మందికి.. అది కూడా పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వేదికపై రాష్ట్రపతి ముర్ముతోపాటు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్వాడ్, డాగ్ స్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ప్రత్యేక పోలీస్‌బలగాలు వేదిక వద్ద అనువణువు పరిశీలించాయి. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశాయి. సీపీ సుధీర్‌బాబు, డీసీపీ రాజేశ్ చంద్ర ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు.