Eid Prayers : మన దేశంలో మత సామరస్యాన్ని చాటి చెప్పే ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి కేరళలో(Kerala) జరిగింది. అక్కడి మలప్పురం దగ్గర మంజేరీ పట్టణంలో నికోలస్ మెమోరియల్ సీఎస్ఐ చర్చి(CSI Church) అని ఒకటి ఉంది. ఆ చర్చి వారు తన విశాలమైన చర్చి మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ముస్లిం సోదరులను ఆహ్వానించారు. దీంతో చర్చి ఆవరణలో రంజాన్ ప్రార్థనలు నిర్వహించేందుకు వందల సంఖ్యలో ముస్లింలు తరలి వచ్చారు.
మంజేరీ పట్టణంలో ఏటా రంజాన్ రోజు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. అయితే ఎన్నికల కారణంగా స్థానిక అధికారులు పాఠశాలను మూసి వేశారు. దీంతో రంజాన్ ప్రార్థనలు చేసుకోవడానికి వారికి వేరే విశాల ప్రాంగణం అవసరం అయ్యింది. దీంతో తమ చర్చి( Church) ప్రాంగణంలో ప్రార్థనలు చేసుకోవాలని చర్చి పెద్దలు, అక్కడి ముస్లి ప్రముఖులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది.
చర్చి ఆవరణలో రంజాన్ ప్రార్థనలు జరుగుతున్న దృశ్యం స్థానికంగా కనువిందుగా మారింది. కాగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదినం రోజు తాము ఈ విధంగా సహాయపడటం ఎంతో ఆనందంగా ఉందని చర్చి ఫాదర్ ఫ్రాన్సిస్ జాయ్ మస్లామణి అన్నారు. మతపరమైన ఉద్రిక్తతలతో కూడిన సమయాల్లో ప్రేమ, ఐక్యత ప్రాముఖ్యతను చాటాలని వెల్లడించారు.