కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామాలయం ప్రధాన పూజారి లేఖ రాశారు. ఆయన చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఫలవంతం కావాలని పేర్కొన్నారు. ఆయన యాత్ర ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ అయోధ్య రాముడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుతున్నానంటూ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం నాడు లేఖ రాశారు. మీరు ఎందుకోసమైతే భారత్ జోడో యాత్రను ప్రారంభించారో, అది ఫలవంతం కావాలని కోరుకుంటున్నానని, మీరు కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర అంటూ మీరు దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చేందుకు, సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అంటే ప్రజల శ్రేయస్సు కోసం, సంతోషం కోసం పాదయాత్ర చేస్తున్నారని, అందుకే మీకు ఆ రామచంద్ర ప్రభువు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య జిల్లా అధికార ప్రతినిధి సునీల్ కృష్ణ గౌతమ్ మాట్లాడుతూ… ప్రజల కోసం చేస్తున్న భారత్ జోడో యాత్రకు మద్దతు ఇస్తూ ఆయన లేఖ రాశారన్నారు. ఆయన రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొందామని భావించినప్పటికీ, ఆరోగ్య కారణాల దృష్ట్యా రావడం లేదన్నారు.
తొమ్మిది రోజుల విరామం అనంతరం భారత్ జోడో యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఈ యాత్ర ఇప్పటికే 110 రోజుల్లో 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో పూర్తయింది. ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చేరుకున్నది. జనవరి 26న కాశ్మీర్లో యాత్ర ముగుస్తుంది.