Aadhar Update: ప్రస్తుతం చాలామంది పదేళ్ల క్రితం ఆధార్ కార్డులనే వాడుతున్నారు. కొత్తగా వాటిని ఇంకా అప్డేట్ చేసుకోలేదు. ఇలాంటివాళ్లు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ యూఐడీఏఐ ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి ఈ గడువును పెంచింది. ఆధార్ అప్డేట్ను 2024 మార్చి 14 వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చుని తెలిపింది. గడువు దాటిన తర్వాత ఆధార్ అప్డేట్ చేస్తే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేండ్లు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలని ఉడాయ్(UIDAI) తెలిపింది. ఇక నుంచి అందరూ ప్రతి పదేళ్లకొకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. దీనివల్ల పౌరుల వ్యక్తిగత డేటా ఎప్పటికప్పుడు సీఐడీఆర్‌లో అప్డేట్ కావడంతోపాటు సరైన సమాచారం ఉంటుందని తెలిపింది.
https://myaadhaar.uidai.gov.in పోర్టల్ ద్వారా ఆధార్ డాక్యుమెంట్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ చేయాలంటే ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్లి.. ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ వివరాలతో లాగిన్ చేయాలి. తర్వాత పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వివరాలు బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే లిస్ట్‌లో నుంచి మీరు అప్డేట్ చేయాలనుకునే అంశాన్ని ఎంచుకుని ప్రొసీడ్ అప్డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వివరాలు నమోదు చేసి దానికి స్కాన్ చేసిన కాపీలు అప్లోడ్ చేయాలి.
ఇలా రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, విద్యార్థులు అయితే విద్యా సంస్థ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, మార్క్ షీట్, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు. వీటితో పాటు మూడు నెలల్లోపు చెల్లించిన విద్యుత్, వాటర్, గ్యాస్, టెలిఫోన్ బిల్లుల రశీదులు కూడా ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించవచ్చని ఉడాయ్ తెలిపింది.