»Mla Korumutla Srinivasulu Agitators Will Lose Jobs
MLA Korumutla Srinivasulu: ఆందోళన చేస్తే ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరిక!
సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నమయ్యలో నిరసన శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరించారు.
MLA Korumutla Srinivasulu: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిన్న ఆందోళనలు చేపట్టారు. వేతనాల పెంపుతోపాటు గ్రాట్యుటీ అమలు, పింఛన్ సౌకర్యం కల్పించాలంటూ అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి నిరసనలు తెలుపుతున్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు నిర్వహించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే నిన్న అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఆ నేపథ్యంలోనే అన్నమయ్యలో నిరసన చేపడుతున్న శిబిరానికి దగ్గరగా భూపంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి హాజరైన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు శిబిరం దగ్గరకు వచ్చి.. అంగన్వాడీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారా అంటూ గట్టిగా మందలించారు. ఇలాగే మీరు నిరసనలు చేస్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలపై మండిపడ్డారు. ఆ క్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు తమ హామీల గురించి ఎమ్మేల్యేను నిలదీసారు. సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వైసీపీ కార్యకర్తలు సైతం అంగన్వాడీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారు.