»18th Lok Sabha Special Session June 24 President Address Speaker Election Neet Net Ugc Paper Leak Congress Bjp
Parliament Session : జూన్ 24 నుంచి 18వ లోక్సభ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే
లోక్సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నుంచి కేబినెట్ సభ్యుల వరకు ప్రమాణ స్వీకారం చేయగా, కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణం ఇంకా జరగలేదు.
Parliament Session : లోక్సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నుంచి కేబినెట్ సభ్యుల వరకు ప్రమాణ స్వీకారం చేయగా, కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణం ఇంకా జరగలేదు. జూన్ 24 నుంచి లోక్సభ 18వ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్సభ సమావేశాల మొదటి రెండు రోజులలో అంటే జూన్ 24, సోమ, 25 జూన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణం చేయిస్తారు.
మరుసటి రోజు అంటే జూన్ 26వ తేదీ బుధవారం లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవికి ఎన్నిక అనంతరం ప్రధాని తన మంత్రివర్గంలోని మంత్రులను సభకు పరిచయం చేస్తారు. మరుసటి రోజు అంటే జూన్ 27 గురువారం ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు. మరుసటి రోజు జూన్ 28, జూలై 1 తేదీల్లో ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగనుంది.
జులై 2న లోక్సభలో, జూలై 3న రాజ్యసభలో చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఇది లోక్సభ ప్రత్యేక సమావేశాలు కాబట్టి ఈ సెషన్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఉండదు. 18వ లోక్సభ సమావేశాలు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. పేపర్ లీక్, ప్రొటెం స్పీకర్ నియామకం సహా పలు అంశాలపై విపక్షాలు ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహం పన్నాయి. బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్ను ప్రొటెం స్పీకర్గా నియమించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోమవారం నుంచే సభలో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ నియామకంలో సంప్రదాయాన్ని విస్మరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోమవారం నుంచి ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయి.