తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు పేరు అజరామరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదు పొందిన అంతటి గొప్ప వ్యక్తిని ఓ హీరోయిన్ కాలితో తన్నింది. ఎన్టీఆర్ నే కాలితో తన్నేంత పొగరు ఆ హీరోయిన్ ఎక్కడిది? అని అప్పట్లో తీవ్ర వివాదం నడిచింది. ఎన్టీఆర్ నే తన్నేంత ధైర్యం ఎక్కడిది? ఇక ఆమెను సినిమాల నుంచి బహిష్కరిద్దామనే స్థాయికి వివాదం రేగింది. అయితే ఆమె వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇంతకీ ఎన్టీఆర్ ను కాలితో తన్నిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు జమున. నేడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన జమున సినిమాలో భాగంలో ఎన్టీఆర్ కాలితో తన్నారు.
తెలుగు సినీ చరిత్రలో ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా చెక్కు చెదరనిది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో మెరిశారు. ఆయన నటనను చూస్తే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు దిగి వచ్చాడు అన్నట్టు అనిపిస్తుంది. ఆ సినిమాలో రుక్మిణి, సత్యభామల కలహాలు, అలకలతో సినిమా రసకందాయంగా ఉంటుంది. ఆ సినిమాలో సత్యభామ పాత్రను జమున పోషించారు. ఒక సన్నివేశంలో సత్యభామ అలిగి కృష్ణుడిని కాలితో తన్నుతుంది. సినిమాలో భాగంగా జమున ఎన్టీఆర్ ధరించిన కిరీటాన్ని తన్నే సీన్ చేశారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు, అభిమానులు ఆ సీన్ పై రాద్ధాంతం చేశారు. ఎన్టీఆర్ నే కాలితో తన్నే స్థాయికి వెళ్లారా అని హీరోయిన్ జమునపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదరడంతో జమున వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని.. ఎన్టీఆర్ అంటే తనకు గౌరవమని జమున వివరణ ఇచ్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.
తెలుగు సినిమాల్లో జమునకు సత్యభామలాంటి పాత్రలే అధికంగా వచ్చాయి. కోపిష్టి.. అలకలు ఎక్కువగా ఉండే పాత్రలే వచ్చాయి. అలాంటి పాత్రల్లో జమున చక్కగా ఒదిగారు. గుండమ్మ కథలో సూర్యకాంతం కూతురిగా జమున చేసిన నటన అందరికీ ఇప్పటికీ గుర్తుంటుంది. గడసరి అమ్మాయి, అల్లరి పిల్ల మాదిరి జమున కనిపిస్తుంది. అంతటి గొప్ప పాత్రలు చేసిన జమున కన్నుమూయడం చిత్రసీమకు తీరని లోటు. ఆమెకు ‘హిట్ టీవీ’ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నది.