ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్.. ఆస్కారం ఉందో లేదో ఇప్పుడే చెప్పలేం.. కానీ ఈసారి ఆస్కార్ అవార్డు మాత్రం తెగ ఊరిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఉన్నాడని ‘వైరెటీ’ మ్యాగజైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఛాన్స్ అందుకునే లిస్ట్ పెరిగిపోయింది. ఈ విషయంలో గత కొద్ది రోజులుగా నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సారి ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ నిలవడం పక్కా అంటున్నారు. ఇక తాజాగా తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆస్కార్ రేసులో ఉన్నాడని వైరెటీ మ్యాగజైన్ తెలిపింది.
దాంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిలో ఒకరికైనా ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మరో విశేషమేంటంటే రాజమౌళి కూడా ఆస్కార్ రేసులో ఉన్నట్టు ‘వైరెటీ’ మ్యాగజైన్ ప్రిడిక్షన్లో తెలిపింది. రాజమౌళినే కాదు మొత్తంగా ఐదు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. లేటెస్ట్ ప్రిడిక్షన్స్ ప్రకారం.. ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి.. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ సినిమాగా RRR.. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా దోస్తీ.. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో.. ట్రిపుల్ ఆర్ నామినేట్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయ పడింది. దాంతో మళ్లీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ న్యూస్ వైరల్‌గా మారింది.