ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దసరాకు అప్డేట్స్ లోడింగ్ అంటూ ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయిందని తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రంలో అఖిల్ సరసన ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సాక్షి వైద్యను తీసుకున్నారని వినిపించింది. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. రామ్‌కు తగ్గ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేశారని తెలుస్తోంది. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. తన అందం, డ్యాన్స్‌తో టాలీవుడ్ హీరోలను అట్రాక్ట్ చేసింది. దాంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి.
ప్రస్తుతం రవితేజ సరసన ధమాకాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఎన్బీకె 108లో బాలయ్య కూతురిగా నటిస్తోంది. మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిట్ అయింది. ఈ క్రమంలోనే డీజె టిల్లు సీక్వెల్లో తీసుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ జాయిన్ అయిన తర్వాత.. అమ్మడు హ్యాండ్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రామ్‌తో రొమాన్స్ చేసేందుకు సై అంటోందట. ఓ రకంగా చెప్పాలంటే.. రామ్ కోసమే అమ్మడు హిట్ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. రామ్-బోయపాటి దసరా అప్డేట్లో ఈ అమ్మడు కూడా ఉంటుందని టాక్. ఏదేమైనా రామ్-శ్రీలీల జోడీ డాన్స్‌తో దుమ్ములేపడం ఖాయమని చెప్పొచ్చు.