Jagratha bidda: చెల్లెళ్ళకు జరిగిన అన్యాయానికి ఓ అన్న విధించిన శిక్ష నేపథ్యంలో రూపొందిన చిత్రం “జాగ్రత్త బిడ్డా” (Jagratha bidda). టీవి సీరియల్స్ తీసిన “కృష్ణ మోహన్”ను దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. కె.ఎస్.బి.క్రియేషన్స్ – ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రిటైర్డ్ పోలీసు అధికారి శ్రీకాంత్ కరణం – ఎమ్.వై.గిరిబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న “జాగ్రత్త బిడ్డా” మూవీ ఈ నెల 23వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. “మినిమం గ్యారంటీ మూవీస్” (ఎమ్.జి.ఎమ్) ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ములుగు ఎమ్మెల్యే – ఫైర్ బ్రాండ్ సీతక్క “జాగ్రత్త బిడ్డా” పోస్టర్ విడుదల చేశారు. తర్వాత చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “డి.జె.టిల్లు, బలగం” చిత్రాల కోవలో.. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సందేశాత్మక చిత్రం మంచి విజయం సాధించాలని ఆమె అభిలషించారు. సీరియస్ ఇష్ష్యూ బ్యాక్ డ్రాప్లో గ్రిప్పింగ్ నేరేషన్ తో రూపొందిన “జాగ్రత్త బిడ్డా” (Jagratha bidda) కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, సాయి వెంకట్‌తోపాటు చిత్రబృందం పాల్గొన్నారు.