హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సుఖంగా మారిందనే చెప్పాలి. మెట్రో రాక ముందు నగరవాసులు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కానీ మెట్రో వచ్చిన తర్వాత… కాస్త ఊరట లభించింది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. అయితే.. ఈ మెట్రో లో ప్రయాణించడానికి టికెట్ తీసుకున్న పద్దతి గురించి అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. కాగా.. తాజాగా కేవలం వాట్సాప్ నుంచే మెట్రో టికెట్ బుక్ చేసుకునె వెసులుబాటు తీసుకువచ్చారు.
ప్రయాణికులు వాట్సాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఇచ్చింది. దేశంలోనే తొలిసారి ఈ విధానాన్ని హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చింది. ఈ మేరకు బిల్ ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విధానాన్ని తీసుకువచ్చేందుకు మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం సింగపూర్‌లోని బిల్ ఈజీ అండ్ ఏఎఫ్ భాగస్వామి ShellinfoGlobalsg సహకారం తీసుకుంది. ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ ద్వారా డిజిటల్ టిక్కెట్ బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించారు.
ఈ సర్వీస్.. హైదరాబాద్ ప్రయాణికులకు సజావుగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రయాణికులు ఇప్పుడు వారి వాట్సాప్ నంబర్లో ఇ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. దానిని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద చూపించాలి.
వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు.. ముందుగా 83411 46468 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ చెప్పాలి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత.. మనం వెళ్లాల్సిన చోటును ఎంటర్ చేయాలి. టికెట్ డబ్బులు చెల్లించిన తర్వాత.. వెంటనే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఇ-టికెట్ వస్తుంది. మెట్రో స్టేషన్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి సైతం.. టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.