Rashmika Deepfake Video: నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) డీప్ ఫేక్ వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇష్యూపై చర్చ జరగగా.. సెలబ్రిటీలు ఖండించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాను వీడియో యూఆర్ఎల్ ఎక్కడి నుంచి సర్క్యులేట్ అయ్యిందో వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. ఆ డేటా ఆధారంగా బీహర్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆ యువకుడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్ లోడ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత ఇతర ప్లాట్ ఫామ్స్‌లో షేర్ చేశారని భావిస్తున్నారు. మరో యువకుడికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వేరే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వీడియోను డౌన్ లోడ్ చేసుకున్నానని యువకుడు విచారణలో చెప్పాడని తెలిసింది. దానికి సంబంధించి పోలీసులు ప్రశ్నలు వేస్తున్నారు.
బీహార్ యువకుడే రష్మిక (Rashmika) ఫేక్ వీడియో రూపొందించారని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. పూర్తి విచారణ జరిగి.. ఏం జరిగిందో వివరించనున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వీడియో సర్క్యులేట్ చేసిన వారిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు దీంతో ఇతరులు ఇలాంటి వీడియో రూపొందించేందుకు.. లేదంటే సర్క్యులేట్ చేసేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.