నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు కృష్ణం రాజు ఇంటికి వెళ్లారు. తన భార్య వసుంధర సమేతంగా వెళ్లి.. ఆయన కృష్ణం రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల కృష్ణం రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నివాళులర్పించి.. ఆయన భార్యను పరామర్శించారు.
కృష్ణంరాజు మరణించిన సమయంలో ఎన్బీకె 107 షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. అక్కడే షూటింగ్ సమయంలో టీంతో కలిసి బాలయ్య కృష్ణంరాజు కు నివాళి అర్పించారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని.. నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగాననీ, ఇండస్ర్టీకి ఆయనెంతో సేవ చేశారని కొనియాడారు.
అలాంటి అద్భుతమైన నటుడితో కలిసి నటించే అవకాశం సుల్తాన్, వంశోద్థారకుడు చిత్రాలతో వచ్చిందని చెప్పారు. కృష్ణంరాజు గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
కృష్ణంరాజు మరణించిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటుగా ప్రభాస్ ను పరామర్శించారు. కృష్ణంరాజు మరణం పైన సినీ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయంగా పలువురు ప్రముఖులు ఇప్పటికీ ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.