చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్న సినిమా బలగం (Balagam). ఈ మూవీలో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన మొగిలయ్య (Mogilaiah) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గతకొద్ది కాలంగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత సమస్య (Kidney Problem)తో బాధపడుతున్నాడు. కొద్దిరోజులకు ముందే ఆయన వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆ సమస్యకు తోడు హార్ట్ ప్రాబ్లమ్ (Heart Problem) కూడా రావడంతో మొగిలయ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ తరలించేందుకు కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘బలగం’ సినిమాలో మొగిలయ్య పాడిన పాట:
మొగిలియ్య (Mogilaiah) కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో తన భర్తను ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ (Komuramma) కోరుతోంది. ఏడాది నుంచి మొగిలయ్య బీపీ, షుగర్ తో పాటుగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఆయన వారానికి మూడు సార్లు వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించడంతో డయాలసిస్ చేయడానికి మొగిలయ్య శరీరం సహకరించడం లేదని వైద్యులు తెలిపారు.
మొగిలయ్య (Mogilaiah)ను చూసి ఆయన కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. ప్రభుత్వం ఆయన్ని ఆదుకోవాలని కుటుంబీకులు కోరుతున్నారు. బలగం సినిమా (Balagam Movie) క్లైమాక్స్ సాంగ్ పాడి మొగిలయ్య కోట్లాది మంది మనసులను దోచుకున్నారు. ఆయన పాటతో అందర్నీ కంటతడి పెట్టేలా చేశారు. బలగం సినిమా వల్ల వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య, కొమురమ్మ (Komuramma) దంపతులకు మంచి గుర్తింపు వచ్చింది. బుర్ర కథలు చెబుతూ జీవించే మొగిలయ్య ఆరోగ్యం విషమించడంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది.