Deepika Padukone pregnancy announcement : బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొనె తల్లి కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలు 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనె(Deepika Padukone) చేసిన పోస్ట్ విశేషంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
దీపిక తాను తల్లి కాబోతున్నట్లుగా సూచించే ఓ చక్కని ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 2024 సెప్టెంబరులో డెలివరీ డేట్ అన్నట్లుగా అర్థం వచ్చే ఓ చక్కని ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆ పోస్ట్‌ని చూసిన సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కామెంట్లతో ఆమెను ముంచెత్తారు. తల్లిదండ్రులు కాబోతున్న ఆ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో దీపిక పదుకొనె మాట్లాడుతూ “రణ్వీర్(Ranveer)కు, నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో మా ఫ్యామిలీని పరిపూర్ణం చేసుకోబోయే ఆ క్షణం కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. చిన్నప్పుడు నుంచి మా అమ్మానాన్న నన్ను ఎంతో క్రమ శిక్షణతో, వినయంగా పెంచారు. రణ్వీర్ కూడా అలానే పెరిగాడు. అందుకే మేము కూడా మా పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండానే పెంచుతాం. మంచి విలువల్ని నేర్పిస్తాం” అని చెప్పింది. ఇలా చెప్పిన కొన్ని రోజులకే ఈ వార్త బయటకు వచ్చింది.