Protect Your Skin : బయటి కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుకోండిలా!
బయటకు వెళ్లి వచ్చేసరికి ముఖం జిడ్డుగా, మురికి పట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా కొంత కాలం కొనసాగితే రకరకాల చర్మ సంబంధిత సమస్యలు కచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అందుకనే ఈ కాలుష్యం నుంచి దూరం చేసే కొన్ని చిట్కాలిక్కడున్నాయి. చదవేయండి.
Protect Your Skin Frome outside pollution : ఇటీవల కాలంలో వాయు కాలుష్యం(pollution) విపరీతంగా ఉంటోంది. రోడ్డు మీదకు వెళితే చాలు వాహనాలు విడుదల చేసే పొగ వల్ల ముఖం పొగబారి జిడ్డెక్కినట్లుగా అనుభూతి కలుగుతూ ఉంటుంది. కాలుష్యంలో బయట తిరిగి రావాలంటే చర్మం, ముఖాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే మొటిమలు, జిడ్డు, టానింగ్ లాంటి సమస్యలు వస్తాయి. చర్మంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలు తగ్గిపోతాయి. దీంతో చర్మం పొడిబారి రఫ్‌గా తయారవుతుంది. దుమ్ము కణాలు ముఖంపై పేరుకుపోయి చర్మ రంధ్రాలను మూసి వేస్తాయి. రకరకాల చర్మ వ్యాధులు, ర్యాషెస్ రావడానికి కారణం అవుతాయి.
బయటకు వెళ్లేప్పుడు సన్ స్క్రీన్‌ని చేతులు, ముఖానికి రాసుకోవాలి. అలాగే స్కార్ఫ్, హెల్మెట్ లాంటి వాటిని తప్పకుండా ధరించాలి. అలా ఫుల్ హ్యాండ్స్ ఉండే జాకెట్, జర్కిన్లాంటి వాటిని ధరించడం వల్ల కాలుష్యం నేరుగా చర్మం(Skin)పై ప్రభావాన్ని చూపకుండా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్లేవారైతే గొడుగును తీసుకువెళ్లడం, మాస్క్ ధరించడం చేయాలి. బయట నుంచి వచ్చిన తర్వాత ముఖాన్ని మంచి క్లెన్సింగ్ లోషన్‌తో తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అలా ముఖం కడుక్కోవడానికి గోరు వెచ్చని నీటిని ఉపయోగించండి. ఇది ముఖంపై పేరుకున్న జుడ్డును సమర్థవంతంగా తొలగిస్తుంది. తర్వాత దానికి తేమను అందించే అలోవెరా జెల్ మాయిశ్చరైజర్ లాంటి వాటిని ఉపయోగించాలి.
వారానికి ఒకసారైనా శరీరం మొత్తానికి నూనెను పట్టించి, అది కాస్త ఇంకిన తర్వాత నలుగు పిండితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన కాలుష్యంతో కూడిన దుమ్ము, మృత కణాల్లాంటివి పూర్తిగా పోతాయి. తద్వారా ముఖం మెరుస్తూ, కాంతివంతంగా ఉంటుంది. వీటిని చేస్తూ మంచి ఆహారాలను తీసుకోవడమూ చర్మపు ఆరోగ్యానికి అత్యవసరం.