Prashant Kishor : జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమన్న ప్రశాంత్ కిషోర్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో వైసీపీ ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్‌కు ఓటమి తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు.
Prashant Kishor On 2024 Elections : వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. 2019లో ఆ పార్టీ విజయంలో ప్రశాంత్ కిషోర్ వెనకుండి నడిపించారు. వైసీపీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. ఉచిత పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమేనన్నారు. చదువుకున్న వాళ్లు ఉచిత పథకాలను కోరుకోవడం లేదని ఉద్యోగాలు కోరుకుంటున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేశారు. దీంతో అప్పుడు ఆ పార్టీ ఏపీలో 151 సీట్లతో విజయ ఢంకా మోగించింది. ఆ తర్వాత నుంచి జగన్ ప్రశాంత్ కిషోర్‌ను దూరం పెడుతూ వచ్చారు. అప్పటి నుంచి ఆ పార్టీని గమనిస్తూ ఉన్న ప్రశాంత్ పలు సందర్భాల్లో జగన్ పాలన బాలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా కొంత కాలం క్రితం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిశారు. దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.