»Cyclists At Any Stage Of Life Had 17 Percent Less Knee Pain And 21 Percent Less Arthritis
Cycling : సైక్లింగ్ చేసిన వారికి మోకాళ్ల నొప్పుల ఛాన్స్ తక్కువట!
సైక్లింగ్ చేసే వారికి మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం లాంటివి వచ్చే ఛాన్స్ కొంత వరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Cycling : చాలా మంది చిన్న వయసులో ఎక్కువగా సైక్లింగ్ చేస్తుంటారు. కొంత మంది పెద్ద వారయ్యాకానూ ఆ అలవాటును కొనసాగిస్తుంటారు. అయితే ఇలా జీవితంలో ఏదో ఒక దశలో సైక్లింగ్ చేసిన వారికి కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. ఈ విషయమై 60 ఏళ్లు వయసున్న 2600 మందిపై ఓ అధ్యయనం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫలితాలు మెడిసిన్ & సైన్స్ ఇన్ స్పోర్ట్స్ & ఎక్సర్సై్ జర్నల్లో ప్రచురితం అయ్యాయి.
జీవితంలో ఏదో ఒక దశలో ఇలా సైక్లింగ్(Cycling) చేసిన వారికి మోకాళ్ల నొప్పులు(Knee Pain) వచ్చే అవకాశాలు 17 శాతం మేర తగ్గుముఖం పడతాయి. అలాగే కీళ్ల వాతం 21 శాతం తక్కువగా రావచ్చు. పరిశోధకులు ఈ విషయమై మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సైక్లింగ్ వల్ల మోకాళ్లు(Knees) దృఢంగా మారతాయన్నారు. అందువల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కీళ్లు దృఢం కావడంతో వాటికి జరిగే నష్టం కూడా తగ్గుతుందన్నారు.
తాము ఈ అధ్యయనాన్ని దాదాపుగా ఎనిమిదేళ్లపాటు చేశామని పరిశోధకులు చెబుతున్నారు. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో సైక్లింగ్(Cycling) ఎక్కువగా చేసిన వారికి కాళ్ల కండాలు, కీళ్లు బలపడ్డాయని వారు తెలిపారు. అందువల్ల ఆ తర్వాతి కాలంలో వారికి కాళ్ల సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా తక్కువగా వస్తుండటాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఆ తర్వాతి కాలంలో వారు సైక్లింగ్ మానేసినా కూడా కాళ్ల సమస్యలు తక్కువగా వస్తుండటాన్ని తాము గుర్తించినట్లు తెలిపారు.