ఇరాక్(Iraq)లో ఘోర ప్రమాదం జరిగింది. అల్-హమదనియాలోని ఓ పెళ్లి వేడుక(wedding ceremony)లో అగ్నిప్రమాదం సంభవించి 100 మంది మరణించారు. 550 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో వధూవరులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం (Fire Accident)గానే స్లాబ్ కుప్పకూలిందని, డెకరేషన్ ఐటమ్స్ వల్ల వేగంగా మంటలు వ్యాపించాయన్నారు.ప్రమాద సమయంలో ఫంక్షన్ హాల్లో (Function hall) 1,000 మంది ఉన్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.వివాహ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక సివిల్ డిఫెన్స్ తెలిపింది.
మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్ లు (Ambulances) అక్కడికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది అప్పటికే కాలిపోయిన భవనం శిథిలాలపైకి ఎక్కి ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలిస్తున్నట్టు ‘రాయిటర్స్’ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.45 గంటలకు) భవనంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అక్కడ వందలాది మంది ప్రజలు వివాహ వేడుకకు హాజరయ్యారని ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
వెడ్డింగ్హాల్లో మంటలు ఎగసిపడుతున్న వీడియోలు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా(Social media)లోనూ కనిపించాయి. హాల్ మొత్తాన్ని మంటలు కాల్చి బూడిద కుప్పగా మార్చేశాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దురదృష్టకర ఘటన బారినపడిన వారికి సహాయ కార్యక్రమాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి సైప్ అల్ బద్ర్ తెలిపారు. ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుడానీ (PM Al Sudani) ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అధికారికంగా తెలియనప్పటికీ కుర్దిష్ టెలివిజన్ న్యూస్ చానల్ మాత్రం బాణసంచా కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది.