Breaking: జన్మభూమి ఎక్స్ ప్రెస్‌లో పొగలు..పరుగులు తీసిన జనం!
విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలముకోవడంతో ప్రయాణికులు రైలు నుంచి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినప్పటికీ మరోసారి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.
లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ (Janmabhoomi Express) రైలులో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మూడు కంపార్ట్మెంట్లలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటగా జనరల్ బోగీలో పొగలు రావడంతో ఏలూరు వద్ద రైలు సిబ్బంది ట్రైన్‌ను ఆపేశారు. మరమ్మతులు చేసిన కొంతసేపటికి పొగ రావడం ఆగిపోయింది.
ఏలూరు నుంచి అరగంట తర్వాత జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. అయితే తాడేపల్లిగూడెం వద్దకు రాగానే మరో రెండు బోగీల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అధికారులకు సమాచారం అందించారు. దీంతో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలును తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద నిలిపివేయడంతో బోగీల్లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా కిందికి దూకి పరుగులు తీశారు.
రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి పొగ రాకుండా కట్టడి చేశారు. బ్రేకులు పట్టేయడం వల్ల పొగలు వచ్చాయని, అగ్ని ప్రమాదమేమీ జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే అగ్ని ప్రమాదం జరుగుతుందేమోననే భయంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.