అమెరికా(America)లో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. మరో 50-60 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ (High alert) ప్రకటించింది. కాల్పులు(Firing) జరిపిన వ్యక్తి అత్యంత ప్రమాదకారి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు (Police) నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఫొటోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు. కాగా, ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు.