హిందూ మహాసముద్రంలో దొంగలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను హైజాక్ చేశారు. బొగ్గు తీసుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరిన నౌకను అయుధాలతో బెదిరించారు.
Hijack: హిందూ మహా సముద్రం (Indian Ocean)లో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్ నౌకను దొంగలు హైజాక్ చేశారు. ఈ దేశానికి చెందిన నౌకలను హైజాక్(Hijack) చేయడం ఇది రెండవసారి కావడం గమనార్హం. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న కార్గో నౌకను మంగళవారం మధ్యాహ్నం హైజాక్ చేయగా, నౌక యాజమాన్యం బుధవారం అలస్యంగా వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్‌నకు చెందిన నౌక ఇది. దీని పేరు అబ్దుల్లా. ఈ కార్గో నౌక మొజాంబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరింది. సముద్ర తీరంలో ప్రయాణిస్తుండగా అందులో దొంగలు చొరబడ్డారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో సిబ్బందిని బెదిరించారు.
ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది. దుండగులు నౌకను తమ అధీనంలోకి తీసుకున్నారని, సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు, వారితో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. బంగ్లాదేశ్ చరిత్రలో తమ ఓడలు హైజాక్ కావడం ఇది రెండోసారి. 2010లో అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అప్పుడు 25 మంది సిబ్బందిని బందీలుగా చేసుకుని దాదాపు 100 రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఈ ఘటనకు పాల్పడింది సోమాలియా పైరెట్లే అని బంగ్లాదేశ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.