రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. పుతిన్ ను హత్య చేయడానికి జరిగిన దాడి విఫలమైందని అక్కడి మీడియా పేర్కొంది. ఈ సమాచారంపై అధికారిక నిర్ధారణ లేదు. కానీ.. అక్కడి ఓ ప్రముఖ మీడియా ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
ఆ మీడియా కథనం ప్రకారం… రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అధికారిక నివాసానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ముందుగా, పుతిన్ వాహన శ్రేణిని అకస్మాత్తుగా వచ్చిన ఒక అంబులెన్స్ అడ్డుకుంది. ఆ తరువాత, క్షణాల్లో పుతిన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు టైర్ వద్ద పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనలో పుతిన్ కు కానీ, మరెవరికి కానీ ఎలాంటి ముప్పు సంభవించలేదు. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయంలో క్లారిటీ లేదు.
ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ప్రయాణ వివరాలు చివరి నిమిషం వరకు అత్యంత రహస్యంగా ఉంటాయి. అయినప్పటికీ.. ఈ దాడి జరగడంపై పుతిన్ సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత భద్రత దళం చీఫ్ సహా పలు సీనియర్ అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా, వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.