కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్సు(Kranty Province)లో క్వీన్ కొసామక్ హైస్కూల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వెయ్యి మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో నూతన భవనం నిర్మించేందుకు గోతులు తవ్వగా.. ఆయుధాలు బయటపడుతుండటం కనిపించింది. దీంతో ఆ ప్రదేశంలో కంబోడియన్ (Cambodian) మైన్ యాక్షన్ సెంటర్ (సీఎంఏసీ) తవ్వకాలు జరిపింది. పాఠశాల కింద 2116 పేలని బాంబులు లభించాయి. వాటిలో ఎం70 గ్రెనేడ్లు, ఫ్యూజ్ఎం48 బాంబులు, బీ40 రాకెట్ లాంచర్లు లభ్యమయ్యాయి. అక్కడ మరిన్ని ఆయుధాలు ఉండవచ్చని సీఎంఏసీ (CMAC) భావిస్తోంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు పాఠశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతర్యుద్ధం సమయంలో ఈ బడి ఉన్న ప్రాంతాన్ని ఆయుధ కేంద్రంగా ఉపయోగించిన విషయం తనకు తెలుసని..
సీఎంఏసీ డైరెక్టర్ జనరల్ హేంగ్ రతానా (Heng Ratana) తెలిపారు. కానీ ఈ స్థాయిలో బాంబులను భూమిలో దాచిపెట్టడం నమ్మలేకపోతున్నానని అన్నారు. ఒకవేళ వాటిని ఏదైనా బలంగా తాకితే అవి పేలిపోయే అవకాశం ఉందని.. ముందస్తుగా గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. ఆయుధాలలన్నింటినీ అక్కడ నుంచి తరలించామన్నారు. మరోవైపు 2025 నాటికి ఇటువంటి ల్యాండ్ మైన్స్(Land mines), పేలని బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో అక్కడి అంతర్యుద్ధం (civil war) సమయంలో పాతిపెట్టినవిగా గుర్తించారు.