ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రలకు పేరుగాంచిన కుటుంబం ఏదంటే దివగంత నేత రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) కుటుంబం అని చెప్పుకోవచ్చు. తండ్రి వైఎస్ఆర్(YSR), అన్న వైఎస్ జగన్ బాటలోనే నడుస్తూ వైఎస్ షర్మిల తన ప్రత్యేకత చాటుకున్నారు. తండ్రి, అన్న ఒక్కసారే పాదయాత్ర చేస్తే.. షర్మిల (Sharmila) మాత్రం రెండుసార్లు పాదయాత్ర సాగించడం విశేషం. అందులోనూ ప్రత్యేకత ఏమంటే.. ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో, మరోసారి ప్రత్యేక తెలంగాణలో షర్మిల పాదయాత్ర సాగించారు. అసలు ఓ మహిళ పాదయాత్ర చేయడమే అరుదంటే ఆమె రెండుసార్లు ఆ ఘనతను అందుకున్నారు. 2021లో పార్టీని స్థాపించిన షర్మిల కొద్దిరోజుల్లోనే పాదయాత్ర (Padayatra) కు శ్రీకారం చుట్టడం గమనార్హం. అలా తెలంగాణలో 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ఈ రికార్డు సాధించిన తొలి మహిళగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. తండ్రి తరహాలోనే ప్రజాప్రస్థానం (Prajaprasthan) పేరుతో 2021 అక్టోబరు 20న చేవెళ్ల (Chevella) నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. వివాదాస్పద, వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో చర్యలు తీసుకుంది. అయినా న్యాయపోరాటం చేసి అనుమతి తెచ్చుకున్నారు. దీనికిగాను షర్మిలకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Book of Records)ప్రతినిధులు అవార్డు ప్రదానం చేశారు. ఓ మహిళా ఈ స్థాయిలో పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లిన షర్మిల అడుగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు పడుతుండడం గమనార్హం. వైఎస్సార్టీపీ (YSRTP) కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ప్రచారం ఇటీవలి విస్తృతంగా సాగుతోంది. అలాంటి సమయంలోనే షర్మిల పాదయాత్రకు అవార్డు దక్కడం ఆసక్తికర పరిణామం.