ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 10,000 వేలకు పైగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విడతలవారీగా చేపట్టనుంది. మొత్తం 5 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ ఈ తొలగింపు ప్రక్రియను బుధవారం నుండి ప్రారంభిస్తోంది. హ్యూమన్ రిసోర్సెస్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.
ప్రపంచ ఆర్థిక అస్థిరత, మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగాల కోతకు తెరలేపింది. రానున్న రెండేళ్ల కాలంలో కంప్యూటర్ ఇండస్ట్రీ తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇటీవలె హెచ్చరించారు. ప్రపంచ భయాలకు మైక్రోసాఫ్ట్ ఏమీ అతీతం కాదని కూడా తేల్చి చెప్పారు. మైక్రోసాఫ్ట్ గత ఏడాది జూలైలో, ఆ తర్వాత అక్టోబర్ నెలలో వేలాదిమందికి ఉద్వాసన పలికింది. ఇప్పుడు 11,000 మందిని తొలగించనుంది.