బ్రిటన్ నూతన ప్రధాని గా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా.. ఆయన ఎన్నికపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. భారతదేశం 75వ స్వాతంత్ర వేడుకల జరుపుకుంటున్న ఈ సమయంలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి యూకే ప్రధాని అవుతారని ఎవరైనా ఊహించారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు మెగాస్టార్. యూకే ప్రధాని పగ్గాలు చేపట్టిన మొట్టమొదటి హిందూ ప్రధాని అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా…. రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా చరిత్ర సృష్టించారు. సరిగ్గా దీపావళి నాడు పెన్నీ మోర్డెంట్ రేసు నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రిటన్లో పుట్టి అక్కడే పుట్టి పెరిగిన రిషి సునాక్ తన భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు.యార్క్ షైర్ నుంచి ఎంపీగా ఎన్నుకోబడిన సమయంలో పార్లమెంట్లో భగవద్గీత మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాడు.
ఆయన భారతీయ మహిళనే వివాహం చేసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షితను రిషి పెళ్లి చేసుకున్నాడు. వారికి కృష్ణా, అనౌష్కా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 200 సంవత్సరాలలో అత్యంత చిన్న ప్రధానిగా రిషి సునాక్ రికార్డు సృష్టించడం గమనార్హం.