»Israel Hamas War Bombs Doctors Operations Mobile Torch Light Gaza Hospital Loses Power
Gaza Attack: గాజా ఆసుపత్రిలో కరంట్ కట్.. మొబైల్ టార్చ్ వెలుగులో ఆపరేషన్ చేసిన డాక్టర్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే వైద్య సదుపాయాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా శాఖలు కరెంటు లేకుండా పని చేస్తున్నాయి.
Gaza Attack: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే వైద్య సదుపాయాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా శాఖలు కరెంటు లేకుండా పని చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల సాయంతో ఆసుపత్రిని నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడుకోవడానికి ఐసీయూ, పడకలు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో డాక్టర్లు టార్చ్‌లైట్ ద్వారా రోగులకు చికిత్స చేస్తున్నట్లు కనిపిస్తోంది.
గురువారం ఇక్కడ ఓ ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. సమీపంలోని ప్రజలు ఈ భవనంలో చిక్కుకున్న వ్యక్తులకు సహాయం చేయడానికి తరలివచ్చారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, సామాగ్రితో ఎక్కువ మంది ప్రాణాలను రక్షించలేమని నాజర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ ఖండిల్ అన్నారు. చాలా రోజులుగా ఆసుపత్రిలో కరెంట్ లేదని యావత్ మానవ సమాజాన్ని వేడుకుంటూనే ఉన్నాం. క్షతగాత్రులకు చికిత్స చేయడానికి మొబైల్లోని టార్చ్ లైట్ ను ఉపయోగిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఎక్కువ మంది పిల్లలు, మహిళలు చనిపోతారని, వైద్యం అందక గాయపడిన వారు కూడా మృత్యువాత పడాల్సి వస్తుందని డాక్టర్ ఖండిల్ అన్నారు. నిన్న 80 మంది పౌరులు గాయపడినట్లు గుర్తించామని ఆయన చెప్పారు. వైమానిక దాడి తర్వాత మరణించిన 12 మృతదేహాలను కనుగొన్నామన్నారు. గాయపడిన రోగులలో ఇద్దరిని వెంటిలేటర్, ఐసియు బెడ్ లేకపోవడంతో కాపాడలేకపోయామన్నారు.
అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. హమాస్ గ్రూపును పూర్తిగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రమాణం చేసింది. 3,785 మంది పాలస్తీనియన్లు మరణించారని, 12,500 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లో 1,400 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి మాట్లాడుతూ.. 206 మందిని హమాస్ బందీలుగా చేసి గాజాకు తరలించినట్లు తెలిపారు.