Indian Filter Coffee : ఫిల్టర్ కాఫీ రుచికి ఫిదా కాని వారు అంటూ ఉండరు. దాని రుచి, వాసన అలాంటిది మరి. అందుకనే ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ఫ్లాట్ ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రపంచంలోనే అత్యుత్తమమైన 38 కాఫీల జాబితాని విడుదల చేసింది. అందులో మన దక్షిణాదికి చెందిన ఫిల్టర్ కాఫీ(Filter Coffee) రెండో స్థానాన్ని దక్కించుకుంది.
తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్ ఎస్ప్రెస్సో నిలిచింది. ఈ క్యూబన్ కాఫీ డార్క్ రోస్ట్ కాఫీ. పంచదారను ఉపయోగించి చేసే షాట్స్ రూపంలో ఉంటుందిది. దీనిపై లేత గోధుమ రంగులో నురగలాంటిదీ ఉండి తాగేప్పుడు అద్భుతంగా ఉంటుందట. అందుకనే ఇది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీని తర్వాత స్థానాన్ని మన ఫిల్టర్ కాఫీ(Filter Coffee) కొట్టేసిందన్నమాట.
ఫిల్టర్ కాఫీని తయారు చేసుకోవాలంటే రాత్రిపూట ఫిల్టర్‌లో కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఆ డికాక్షన్‌కి వెచ్చని పాలు, చక్కెర కలిపి వేడి వేడిగా తాగుతారు. ఇత్తడి గ్లాసుల్లో ఎక్కువగా దీన్ని తాగేందుకు భారతీయులు ఇష్టపడుతుంటారు. మరి టాప్ టెన్‌లో ఉన్న మిగిలిన కాఫీల పేర్లేంటో తెలుసుకుందాం. మూడో స్థానం నుంచి వరుసగా పది స్థానాల్లో ఉన్న కాఫీలు పేర్లు ఇలా ఉన్నాయి. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో(గ్రీస్), ఫ్రెడ్డో క్యాపచీనో(గ్రీస్), క్యాపచీనో(ఇటలీ), టర్కిష్ కాఫీ(టర్కీ), రిస్ట్రెట్టో(ఇటలీ), ఫ్రాప్పే(గ్రీస్), ఐస్కాఫీ(జర్మనీ), వియత్నామీస్ ఐస్డ్ కాఫీ(వియత్నాం).